ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేసే చెన్నైకు చెందిన స్వాతి (25) హత్యకు బెంగుళూరులో ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. చెన్నై ఎంఎం నగర్‌లోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో విధుల్లో చేరక ముందు స్వాతి ఆరు నెలల పాటు బెంగుళూరు కార్యాలయంలో పని చేసింది. ఆసమయంలో అక్కడ ఏదైనా సమస్యలో చిక్కుకుని ఉండొచ్చని చెన్నై నగర్ పోలీసులు భావిస్తున్నారు. దీనికితోడు... టెక్కీ స్వాతిని పీక కోసేందుకు నిందితుడు వాడిన కత్తి కర్ణాటకలోని ఓ ప్రాంతం వాసులు వాడే కత్తిగా చెన్నై పోలీసులు గుర్తించారు. దీంతో చెన్నై నగర పోలీసులు బెంగుళూరుకు వెళ్లి విచారణ జరుపనున్నారు.
మరోవైపు.. స్వాతి హత్య జరిగి వారం రోజులు కావొస్తున్నా.. రవ్వంత ఆధారం లేదా క్లూను చెన్నై నగర పోలీసులు సాధించలేక పోయారు. దీనిపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా మందలించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసి డెడ్‌లైన్ విధించింది. దీంతో నగర పోలీసులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు.
ఇంకోవైపు.. స్వాతి హత్య కేసులోని నిందితుడిని గుర్తించేందుకు ఐదు లక్షల ఫోన్ కాల్స్‌ని ట్రేజ్ చేస్తున్నారు. స్వాతి మొబైల్ నంబరు ఆధారంగా ఈ ఫోన్ కాల్స్ విశ్లేషణ చేస్తున్నారు. గత మూడు నెలల పాటు స్వాతి ఫోన్ నుంచి వెళ్లిన.. వచ్చిన ఫోన్ కాల్స్‌ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే, స్వాతి నివాస ప్రాంతమైన చూలైమేడు, షెనాయ్ నగర్, సౌరాష్ట్ర నగర్ తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు.