ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

దేవి

గురువారం, 20 ఫిబ్రవరి 2025 (19:31 IST)
Dhanaraj, Samudrakhani
రామం రాఘవం అనేది ధనరాజ్ కోరనాని దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఇందులో ధనరాజ్ కోరనాని, మోక్షా సేన్‌గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు, సముద్రఖని, హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, పలువురు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి దుర్గా ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ అందించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై పృధ్వి పోలవరపు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 21న విడుదల కాబోతుంది. ముందుగానే ప్రముకులకు ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.
 
కథ:
సముద్రఖని, ప్రమోదీల దంపతులకు పుట్టిన కొడుకు (ధనరాజ్‌)ను ప్రాణంగా చూసుకుంటారు. తల్లి గారాబం, తండ్రి అతి ప్రేమతో ధనరాజ్‌ కు చదువు అబ్బక స్నేహితులతో సిగరెట్లు, మద్యం, పేకాట అలవాటుచేసుకుంటాడు. తండ్రి ఎన్నిసార్లు మందలిచ్చినా మారడు. సముద్రఖని  గవర్నమెంట్‌ కార్యాలయంలో నిజాయితీగల అధికారి. అదే కార్యాలయంలో అవినీతిపరుడు పృధ్వీరాజ్‌. లంచాలు తీసుకుని అంచెలంచెలుగా ఎదిగి కొడుకు అడిగిందల్లా ఇస్తుంటాడు. దీనికి వ్యతిరేకంగా వున్న ధనరాజ్‌ తన తండ్రి ప్రవర్తనతో విసుగుచెందుతాడు.
 
ఇదిలా ఉండగా మొదటి చూపులోనే మోక్షా సేన్‌గుప్తా ను ప్రేమిస్తాడు. ఆమె రిజెక్ట్ చేస్తుంది. ఇతనికి సత్య, హరీష్‌ ఉత్తమ్‌ స్నేహితులు . హరీష్‌ లారీ డ్రైవర్‌. తన బాధనంతా వారితో వెల్లగక్కిన ధనరాజ్‌, తన తండ్రిని  చంపేయమని  హరీష్‌ను పురాయిస్తాడు. ఆ తర్వాత ఏమయింది? రఘువరన్‌ చనిపోయాడా? ధనరాజ్‌ అనుకున్నట్లు   ఆయన కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
 
సమీక్ష:
ఇది ఫక్తు మధ్యతరగతి జీవితం. కుటుంబంలో నెగెటివ్‌ ఆలోచనలున్న కొడుకు ఎలా వుంటాడో ఇందులో కళ్ళకు  కట్టినట్లు చూపించాడు దర్శకుడు  కూడా అయిన ధనరాజ్‌. రెండు భిన్నమైన కర్తవ్యాలను నిర్వర్తించాడు. కొడుకే కన్న తండ్రిని చంపేయాలనుకోవడం అనే కథలు సినిమాలుగా ఫచ్చేసాయి. ఇటీవలే వచ్చిన  జైలర్ కథ అటువంటిదే.  నేపధ్యాలు వేరు. రాజకీయ కథలలో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అవి కాకుండా చేడుకు బానిస అయిన పిల్లల సంఘటనలు సమాజంలో చాలానే వున్నాయి. రీసెంట్‌ గా కోట్ల ఆస్తివున్న వ్యాపారవేత్తను స్వయానే మనవుడు చంపిన ఘటన హైదరాబాద్‌ లోనే చూశాం. 
 
దేశంలో చాలా చోట్ల జరుగుతున్న విషయాలు ఈ సినిమాలో వుంటాయి.  ఈ సినిమాలో దర్శకుడు  కన్న తల్లి, తండ్రుల ప్రేమను చక్కగా ఆవిష్కరించారు. కుటుంబంలో ఇద్దరుంటే అందులో ఒకరు ధర్మం, మరొకరు అధర్మం వైపు వుండడం సహజంగా చూస్తుంటాం. కానీ ఒక్కడే కొడుకు ఎందుకిలా అయ్యాడనేది తండ్రి..  తన పెంపకమా? అంటూ ఆయన మదనపడే సన్నివేశం బాగా ఆవిష్కరించాడు. మట్టి మంచిది. విత్తనం మంచిదే, కానీ చెట్లు ఎందుకు ఇలా పెరిగింది? అనే సందర్భమగా  వచ్చే సంభాషణలు ఆకట్టుకు న్నాయి. గతానికి ఇప్పటిజనరేషన్‌ కు గల  వ్యత్యాసాన్ని   ధనరాజ్‌ పాత్రలో దర్శకు డు బాగా చూపించాడు. నెలకు  20వేల జీతం వస్తే 40వేల అవ్వాంటే రెండేళ్ళు పడుతుంది. అంత ఓపిక నాకు లేదు. అందుకే రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులు అవ్వాలనుకునే యువతకు   ప్రతిబింబంగా ఆ పాత్ర డిజైన్‌ అమరింది. 
 
ఎంతమంచి స్నేహితుడున్నా చెడిపోయే గుణం వున్న వాడిని  ఎవ్వరూ మార్చలేరు. ఇందులో దర్శకు డిగా ధనరాజ్‌ కథలో తిప్పిన మలుపులు ఊహకు అందనివిగా వున్నాయి. సెకండాఫ్‌ లో క్లయిమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ చాలా బాగుంది. ముగింపులో హృదయాన్ని  బరువెక్కేలాచేస్తాయి. నటనాపరంగా సత్య ఈజీగా చేసేశాడు.నిజాయితీ అధికారిగా కొడుకంటే ప్రాణం ఇచ్చే పాత్రలో సముద్రఖని, అతిగారబంచేసే అమ్మగా ప్రమోదిని నప్పారు. 
 
నటుడిగా ధనరాజ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆహార్యం ధనుష్‌ను గుర్తుచేసేలా వుంటుంది. వాయిస్‌ గంభీరంగా వుంటుంది. అయితే నటనాపరంగా వాయిస్‌ లోవున్న నటన కాస్త ఫేస్‌ లోనూ పతాకసన్ని వేశంలో చూపిస్తే టాలీవుడ్‌ ధనుష్‌ అయ్యేవాడనిపించింది. గతంలో కొన్ని  సినిమాలతో తప్పటడుగు వేసినా ఈ సినిమాతో ఆయన స్థాయి మారిందనే చెప్పడంలో తప్పులేదు. మిగిలిన పాత్రలు పరిధిమేరకు నటించారు.

టెక్నిలక్‌ గా చూస్తే, అరుణ్‌ చిలువేరు నేపథ్య సంగీతం కథనానికి చాలా ప్లస్‌ అయింది. అందుకు  దుర్గాప్రసాద్‌ కెమెరా తోడ్పడింది. పరిమిత లొకేషన్లలో తీసిన ఈ సినిమా వర్తమానకాలానికి సరిపోయేదిగా వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మాటకు, మానవ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటి తరాని కి తెలియజేసిని  ఈ సినిమా. ఒల్గారిటి లేని క్లీన్ కుటుంబ చిత్రం రామం రాఘవం. అందరూ చూడాల్సిన సినిమా. 
 రేటింగ్‌ : 3.25/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు