కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త చట్టంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదంటూ మండిపడ్డారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం... గతంలో తాము రద్దు చేసిన చట్టం వంటిదేనని చెప్పారు. అలాంటి చట్టాన్నే మరొకదాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పుడు తమ ముందు మూడు మార్గాలు ఉన్నాయన్నారు. అందులో ట్రైబ్యునళ్లను రద్దు చేయడం లేదా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయడం లేదా కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టడం అని చెప్పారు. ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై కూడా సీజేఐ మండిపడ్డారు.
ట్రిబ్యునల్స్‌లో నియామకాలు జరుపకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్‌రావుతో కూడిన ధర్మాసనం.. సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతాపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటివరకు ఎంత మందిని నియమించారు? కొందరి నియామకాలు ఉన్నాయని చెప్పారు. ఈ నియామకాలు ఎక్కడ ఉన్నాయి? మద్రాస్ బార్ అసోసియేషన్‌లో రద్దు చేసిన నిబంధనలు ట్రిబ్యునల్ చట్టాన్ని పోలి ఉన్నాయి.
అదేసమయంలో కేంద్రం సమాధానమిచ్చేందుకు 2-3 రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో.. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఆలోగా నియామకాలు జరుగుతాయని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున మరో ఎంపీ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.