కంగనా ఆఫీసును బీఎంసీ కూల్చితే... మమ్మల్ని అడుగుతారేంటి : సంజయ్ రౌత్

గురువారం, 10 సెప్టెంబరు 2020 (19:11 IST)
మహారాష్ట్రలోని శివసేన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఓ ఆట ఆడుకుంటోంది. సుశాంత్ ఆత్మహత్య కేసుపై ఆమె చేసిన వ్యాఖలు శివసేన, కంగనాల మధ్య చిచ్చుపెట్టాయి. ముంబైను ఏకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడాన్ని శివసేన నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా, సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో ముంబై పోలీసుల సచ్ఛీలతపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పైగా, ముంబైలో కంగనా అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరిక చేశారు. 
 
ఈ వ్యాఖ్యలకు కంగనా కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ఫలానా రోజున ముంబైకు వస్తున్న విమానం ల్యాండయ్యే సమయం చెబుతా.. దమ్మున్న మగాడు వచ్చి అడ్డుకోవచ్చని బహిరంగ సవాల్ విసిరింది. అయితే, ఈమె ముంబైలో అడుగుపెట్టేలోపు బాంద్రాలోని మణికర్ణిక పేరుతో కంగనా నిర్మించుకున్న సినీ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇది పెను సంచలనమైంది. బాంబే హైకోర్టు కూడా బీఎంసీ అధికారుల తీరును తప్పుబట్టింది. ఇంటి యజమాని లేని సమయంలో ఎలా కూల్చివేస్తారంటూ సూటిగా ప్రశ్నించింది. పైగా, కంగనా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో కంగనా ఆఫీసు కూల్చివేతపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన  సమాధానమిస్తూ, కంగన కార్యాలయం కూల్చివేతతో శివసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కూల్చివేతను చేపట్టింది బీఎంసీ(బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అని, మీరు ఏదైనా అడగాలంటే మేయర్ లేదా బీఎంసీ కమిషనర్‌ను అడగండి అని మీడియాకు సంజయ్ రౌత్ తేల్చి చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్త సంస్థ పేర్కొంది. 
 
ఇదిలావుండగా, కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతపై ముంబైలో రాజకీయ రగడ ముదురుతోంది. కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేయించిన చర్య పట్ల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కంగనా విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని గవర్నర్‌ తప్పుపట్టారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సలహాదారు అజయ్ మెహతాకు ఫోన్‌ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
కంగనా ఆఫీసు కూల్చివేత, ఇతర పరిణామాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని గవర్నర్ కొషియారీ నిర్ణయించారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కంగన ఆఫీస్ కూల్చివేతను ఖండించారు. ఇదిలా ఉంటే.. ఆఫీస్ కూల్చివేత అనంతరం కంగన శివసేనపై రాజకీయ విమర్శలు పెంచింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

The action at #KanganaRanaut's office is done by BMC. It has no connection with Shiv Sena. You can talk to the Mayor or the BMC Commissioner on it: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/ENwDYrTTky

— ANI (@ANI) September 10, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు