సాగు చట్టాలపై ఉద్యమించకపోతే.. దేశాన్ని కూడా బీజేపీ అమ్మేస్తుంది: రాకేష్ తికాయత్

ఆదివారం, 21 మార్చి 2021 (12:14 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని కూడా విక్రయించే పరిస్థితి వస్తుందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ అన్నారు. 
 
ఇదే అంశంపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మాట్లాడుతూ, లక్షలాది రైతులు ఢిల్లీని ఘెరావ్ చేస్తున్నారని, ఈ ఆందోళన చాలాకాలం పాటు కొనసాగుతుందన్నారు. మూడు నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసేంతవరకు ప్రతి రాష్ట్రంలో, నగరంలో ఈ నిరసన కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
కర్ణాటకలో కూడా ఇలా నిరసన పెల్లుబుకాలని, మీ భూమిని లాక్కోవడానికి, దాన్ని బడా కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తికాయత్ ఆరోపించారు. ఈ రాష్ట్ర రైతులు ప్రేక్షక పాత్ర వహించడం మానాలన్నారు. చీప్ లేబర్ విధానానికి అనువుగా కార్మిక చట్టాలను సవరిస్తున్నారన్నారు. వచ్చే 20 ఏళ్ళల్లో మీరు మీ భూములను కోల్పోవడం ఖాయమన్నారు. అందువల్ల ఇప్పటినుంచే ఇక్కడ ఆందోళన మొదలు కావాలన్నారు.
 
సుమారు 26 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది ఇక్కడితో ఆగదని, అన్నదాతల ప్రయోజనాలు పెను ప్రమాదంలో పడే సూచనలున్నాయని హెచ్చరించారు. మీ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని ప్రభుత్వం చెబుతోంది.. కానీ కనీస మద్దతు ధర చెల్లిస్తే కానీ అమ్మబోమని షరతు విధించండి అని ఆయన కోరారు. 
 
ఇప్పటికీ ఢిల్లీలో రైతులు ఇంకా ఆందోళనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆ స్ఫూర్తి ప్రతి చోటా రావాలని తాను కోరుతున్నట్టు తికాయత్ చెప్పారు.  4 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని, సభ ప్రాంగణంలోనే విత్తనాలు వేసి పంటలు పండిస్తామని ఆయన ఇదివరకు చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే విషయాన్నీ చెబుతున్నానని రాకేష్ ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు