పరీక్షా కాలం. వేసవి కాలంలో ఎండలను మించిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పేపర్ లీకైందంటూ ప్రతిపక్షం వైసీపీ అసెంబ్లీలో పాలక పార్టీని నిలదీస్తోంది. ఐతే అది లీక్ కాదనీ, మాల్ ప్రాక్టీస్ అంటూ బాబు కొట్టి పడేస్తున్నారు. దీనిపై రగడ అలా సాగుతూ వుంది.
మరోవైపు నలందా యూనివర్సిటీలో విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాత్కాలిక వైస్ చాన్సలర్ పంకజ్ మోహన్ ప్రకటించారు. కాగా నెల రోజుల క్రిత నలంద యూనివర్శిటీ ఇద్దరు విద్యార్థులు సహచర విద్యార్థునులపై లైంగిక వేధింపులు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై విచారణ ఒకవైపు జరుగుతుండగానే వైస్ చాన్సలర్ పదవికి రాజీనామా చేశారు.
ఇవన్నీ ఇలా వుంటే బీహారులో మొన్నామధ్య పరీక్ష రాసేందుకు పంపించిన హాల్ టిక్కెట్టుపై విద్యార్థిని ఫోటోకు బదులు ఓ ప్రముఖ నటి నగ్న ఫోటో వుండటంతో బీహార్ విద్యాశాఖ ఎంత మొద్దునిద్రలో వుందో అర్థమయ్యింది. టాప్ హీరోయిన్ టాప్ లెస్ ఫోటోను తన హాల్ టిక్కెట్లో ముద్రించారని సదరు విద్యార్థిని చెప్పినా అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్లు మౌనాన్ని పాటించారు. చివరకి ఆ విద్యార్థిని విషయాన్ని మీడియా దృష్టికి తీసుకురావడంతో మొత్తం సంచలనమై చర్యలు తీసుకోక తప్పలేదు. మొత్తమ్మీద పరీక్షలు జరిగే వేళ విద్యాశాఖలు అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతుంటాయి.