కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోపం వచ్చింది. తన నియోజకవర్గం పరిధిలో ఎవరైనా కులం పేరెత్తితో తంతానని హెచ్చరించారు. ఈ సమాజంలో కులం పేరుతో ఎవరూ వివక్షకు గురికాకూడదనీ.. సమాజం నుంచి కులమతభేదాలను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో నితిన్ గడ్కరీ కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఈయన నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆదివారం పింప్రి-చించ్వాడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. తనకు కులంపై నమ్మకం లేదనీ... ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తెలియదన్నారు. 'కులాలపై మాకు నమ్మకంలేదు. మీ ప్రాంతంలో ఎన్నికులాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ నా ప్రాంతంలో మాత్రం కులం అనేదే లేదు. ఎందుకంటే కులం గురించి ఎవరైనా మాట్లాడితే కొడతానని ముందే హెచ్చరించాను' అని హెచ్చరించారు.
'సమాజంలో పేదలు, ధనవంతులు అనే తేడా ఉండకూడదు. ఎక్కువ కులం, తక్కువ కులం అన్న వ్యత్యాసం కనిపించకూడదు. పేదలకు దుస్తులు, ఆహారం, నివాసం సదుపాయాలు కల్పించి గౌరవించాలి. మానవ సేవే మాధవ సేవ' అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
కాగా, నితిన్ గడ్కరీ ముక్కుసూటిగా మాట్లాడుతారనే పేరుంది. ఈ యేడాది జనవరిలో కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకులను ప్రజలే కొడతారు. కాబట్టి కేవలం మాట ఇవ్వడంకాకుండా... దాన్ని నెరవేర్చేందుకు కృషిచేయాలి' అని వ్యాఖ్యానించారు.