మూడు సంవత్సరాల బిజెపి పాలనలో అభివృద్ధి జరిగిందా?!

శనివారం, 27 మే 2017 (22:12 IST)
భారతీయ జనతా పార్టీ. అధికారంలోకి వచ్చి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే మూడు సంవత్సరాల బిజెపి పాలనలో దేశాభివృద్థి ఎంతమాత్రం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరకపోవడం, అర్హులైన లబ్ధిదారులు మోసపోవడం ఇలాంటివి తప్ప కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో కొంతమందికి తప్ప కనీసం సగానికిపైగా కూడా ఫలితాన్నివ్వలేదనేది ఆ సర్వేలోనే తేలింది. దీంతో మూడు సంవత్సరాల పాలన పూర్తయినా కేంద్ర నాయకులు ఎవరూ మీడియాతో మాట్లాడని పరిస్థితి. 
 
కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బిజెపి వచ్చిన తరువాత అప్పటి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు పక్కన పడేశాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను బిజెపి ప్రభుత్వం మూలన పడేసింది. అయితే పథకాలను మాత్రం పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు దాదాపుగా 111కిపైగా ఉన్నాయని ప్రధానమంత్రి స్వయంగా చెబుతుంటారు. ఎక్కడ సమావేశం జరిగినా ఆయన ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. 
 
కానీ క్రిందిస్థాయి నేతలు మాత్రం పూర్తిస్థాయిలో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఒక్క పార్టీకి సంబంధించిన నేతలే కాదు..ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారన్నది సర్వేలో తేలింది. దీంతో ప్రతిపక్షాలు విమర్సల దాడికి దిగాయి. అయితే బిజెపి మాత్రం సైలెంట్ గా ఉంటోంది. బిజెపి మూడు సంవత్సరాల పాలనలో కేవలం చేసింది బండి సున్నా అంటున్నాయి ప్రతిపక్షాలు. సర్వేలో కూడా ఇలాంటి ఫలితాలే రావడంతో ఏం చేయాలో తెలియక బిజెపి నేతలు ఆలోచనలో పడ్డారు. 
 
దేశాన్ని అభివృద్థి దిశగానే నడుపుతున్నానని ధీమాగా చెబుతున్న మోడీ వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం ఖాయమంటున్నాయి ప్రతిపక్షాలు. అంతేకాదు నోట్ల రద్దు ప్రభావం మోడీ పతనానికి ప్రధాన కారణమని అంటున్నాయి. మరి మోడీ ప్రతిపక్షాలకు ఎలాంటి సమాధానం చెబుతారో... ఏవిధంగా అభివృద్థి చేసి చూపుతారో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి