సెంట్రల్ విస్తాలో వీవీఐపీల నివాసలకు భూగర్భ స్థావరాలు!
గురువారం, 4 మార్చి 2021 (14:07 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో కొత్త పార్లమెంట్ భవన సముదాయం (సెంట్రల్ విస్తా) ఒకటి. సుప్రీంకోర్టు అనుమతితో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అయితే, ఈ ప్రాజెక్టులో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎంపీల చాంబర్లకు మూడు భూగర్భ సొరంగాలను నిర్మించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ వేగంగా పార్లమెంట్‌కు చేరుకునేలా ఈ సొరంగ మార్గాలు దోహదపడుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం వీఐపీల రాకపోకల సందర్భంగా వారి కాన్వాయ్‌తో ట్రాఫిక్‌కు, జనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ భూగర్భ సొరంగాల ద్వారా ఆ బాధలకు స్వస్తి చెప్పొచ్చని అంటున్నారు.
సెంట్రల్ విస్టా భవన నిర్మాణ ప్రణాళిక ప్రకారం ప్రధాని ఇల్లు, కార్యాలయం సౌత్ బ్లాక్ వైపు రానున్నాయి. ఉప రాష్ట్రపతి ఇల్లు ఉత్తర దిక్కున బ్లాక్‌లో ఉండనుంది. ప్రస్తుతం రవాణా, శ్రమ శక్తి భవనాలు ఉన్న ప్రదేశాల్లో ఎంపీల చాంబర్లను నిర్మించనున్నారు.
కాగా, ఈ సొరంగాలను ఒకే వరుసగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వీఐపీలు తప్ప ఎవరూ రారు కాబట్టి సింగిల్ లేన్ సరిపోతుందని భావిస్తున్నారు. చిన్న దూరాలే కాబట్టి గోల్ఫ్ కార్ట్ (గోల్ఫ్‌లో వాడే చిన్న చిన్న వాహనాలు) వాడొచ్చని తెలుస్తోంది.
అయితే, రాష్ట్రపతి భవన్ నుంచి మాత్రం ఇలాంటి సొరంగాలు అవసరం లేదని అధికారులు అంటున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చాలా దూరం కావడం, పార్లమెంట్‌కు ఆయన వచ్చేది తక్కువ కావడం, దానికీ షెడ్యూల్ ముందే ఖరారవడం వంటి కారణాల వల్ల సొరంగాలు అవసరం లేదని చెబుతున్నారు.
పార్లమెంట్ నిర్మించే ప్రాంతంలో జనానికి ఇబ్బందులు లేకుండా చూడటం కోసమే భూగర్భ సొరంగాలను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ల్యుటెన్స్ బంగళా నుంచి పార్లమెంట్ మధ్య ఎప్పుడూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జనానికి అసౌకర్యం కలగకుండా, పర్యాటకులకు దారులను తెరిచి ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.