తల్లిదండ్రుల ప్రేమ ముందు ఉగ్రవాదం లొంగిపోయింది. ఉగ్రవాదాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ తల్లిదండ్రులు చేసిన వినతికి ఆ ఉగ్రవాదుల మనసు కరిగిపోయింది. దీంతో వారు తుపాకులు వీడి పోలీసులకు లొంగిపోయారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గాం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిరశీలిస్తే,
కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఓ ఇంట్లో ఇద్దరు ముష్కరులు నక్కీ ఉన్నారని బలగాలు గుర్తించాయి. వెంటనే వారి తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చేరవేసి వారు లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించాయి. తల్లిదండ్రులు బతిమాలడంతో ఆ ఇద్దరు లొంగిపోయారు. అనంతరం వారి నుంచి ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన ఇద్దరు ముష్కరులు ఇటీవలే ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదుల అలజడి ఉందని, అందుకే ఇంకా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు భారత బలగాలు వెల్లడించాయి. ఎన్‌కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలను రక్షించామని కాశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని, హింసా మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఇద్దరి ప్రాణాలు రక్షించినట్లే తల్లిదండ్రులు సహకరిస్తే వందల మంది ప్రాణాలను కూడా కాపాడవచ్చని విజయ్‌కుమార్ పేర్కొన్నారు.