ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గురువారం రాత్రి పోలీసులపై స్థానికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎస్పీతో సహా 14 మంది మృతి చెందారు. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా జవహర్ బాగ్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన వందల ఎకరాల భూమి ఆక్రమణకు గురికావడంతో ఆజాద్ భారత్ విదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రాహి అనే మత సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించింది. అయితే భూ ఆక్రమణలు తొలగించాలని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆక్రమణదారులను తరిమికొట్టడానికి రంగంలోకి దిగారు. ఆగ్రహం చెందిన 3 వేల మంది అక్రమ నిర్మాణదారులు .. పోలీసుల తీరుని ఖండిస్తూ వారిపై రాళ్ల వర్షం కురిపించి, అనంతరం కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకునేలోగానే ప్రాణనష్టం జరిగిపోయింది. స్థానికులు జరిపిన దాడిలో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు నగరంలోని ఫరా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సంతోష్ కుమార్, మరో 12 మంది చనిపోయారు.