నేను రాహుల్ కంటే చిన్నవాడిని, అఖిలేష్ నాకంటే పెద్దోడు... యూపీ సీఎం యోగి సెటైర్లు

మంగళవారం, 21 మార్చి 2017 (18:15 IST)
ఇప్పుడు దేశంలో ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారయా అంటే యోగి ఆదిత్యనాథ్ గురించే. ఆయన మంగళవారం నాడు లోక్‌సభలో మాట్లాడారు. గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా వున్న ఆయన తాజాగా యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సభకు ధన్యవాదాలు చెపుతూ... తన వయసు గురించి చాలామందికి ఇప్పుడు సందేహాలు కలుగుతున్నాయనీ, వాటిని ఇప్పుడే నివృత్తి చేస్తానన్నారు. 
 
నా వయసు ఎంత అని మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. తను రాహుల్ గాంధీ కంటే ఒక ఏడాది చిన్నవాడినని, అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన కంటే చాలా పెద్దవారని ఛలోక్తి విసిరారు. దీనితో సభలో నవ్వులు విరిశాయి.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... యూపీఎ హయాంలో ఉత్తరప్రదేశ్ ఒక్క అడుగు కూడా అభివృద్ధి వైపు సాగలేదన్నారు. అలాగే అఖిలేష్ యాదవ్ సమయంలోనూ పేద రైతులను గాలికొదిరేశారని విమర్శించారు. ఇప్పుడు వారంతా భాజపా వైపు చూశారనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపు ఆశగా చూస్తున్నారన్నారు. ఇప్పటికే కేంద్రం వేలకోట్లు నిధులను రాష్ట్రానికి అందించిందన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రానికి మరిన్ని నిధులు సమకూరుస్తారనీ, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తారని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి