ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఢిల్లీలో కలుసుకున్నారు. వీరిద్దరి సమావేశం ప్రధాని నివాసంలో జరిగింది. వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. మరో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ మార్పులు తథ్యమన్న ఊహాగానాల మధ్య ఆయన ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు, యూపీలో ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ప్రధానిని యోగి కలిశారన్న చర్చ సాగుతోంది. బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌తో బుధవారం రాత్రి యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. సమావేశానికి సంబంధించిన నివేదికను పార్టీ అధిష్టానానికి అందించడం కోసమే యోగి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఎప్పుడూ జరిగే సాధారణ సమావేశమేనని యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. సునీల్ బన్సాల్ హెలికాప్టర్‌లో హుటాహుటిన లక్నోకు రావడం, సమావేశానికి హాజరుకావడం వంటి పరిణామాలు రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పుల కోసమేనన్న చర్చ నడుస్తోంది.
ముఖ్యంగా, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో యోగి సర్కార్ ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో యోగి సమావేశమైన సంగతి తెలిసిందే. నాయకత్వ మార్పు తథ్యమని భావిస్తుండటం వల్లే సీఎం యోగి అటు హోంమంత్రి, ఇటు ప్రధానమంత్రిని కలుస్తున్నారే ప్రచారం సాగుతోంది.