సినిమాపై మోజుతో ఐఏఎస్‌ వద్దనుకున్నారు..

గురువారం, 5 అక్టోబరు 2023 (08:42 IST)
ఈ కాలంలో ఐఏఎస్ ఉద్యోగానికి ఎంపిక కావడమంటే ఆషామాషీ కాదు. అలాంటిది.. ఓ వ్యక్తి సినిమాలపై ఉన్న మోజుతో ఏకంగా ఐఏఎస్ ఉద్యోగానికే రాజీనామా చేసి వార్తల్లో నిలిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు. ఆ వ్యక్తి పేరు అభిషేక్ సింగ్. 
 
నటన, మోడలింగుపై ఉన్న ఆసక్తితో అభిషేక్‌ ఇప్పటికే కొన్ని సినిమాలకు పనిచేశారు. సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై ఢిల్లీకి వెళ్లారు. ఉన్నతాధికారులు ఆ వ్యవధిని 2018లో మరో రెండేళ్లు పెంచారు. అభిషేక్‌ ఆ సమయంలో మెడికల్‌ లీవ్‌ తీసుకొని విధులకు దూరంగా ఉన్నారు. 
 
ఈ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం 2020 మార్చిలో ఆయన్ను సొంత రాష్ట్రానికి పంపింది. అయినా వెంటనే విధుల్లో చేరకుండా.. సరైన కారణం చెప్పకుండా.. మూడు నెలల తర్వాత జూన్‌లో విధుల్లో చేరారు. గతేడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన అభిషేక్‌.. తానే పరిశీలకుడినని తెలిపే ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. 
 
దీంతో ఈసీ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. విధుల్లో నిర్లక్ష్యం చూపారన్న కారణంగా ఈ యేడాది ఫిబ్రవరిలో అభిషేక్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈయన సతీమణి శక్తి నాగ్‌పాల్‌ కూడా ఐఏఎస్‌ అధికారే. అభిషేక్‌కు ఇన్‌స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు