సీఎం జగన్ సేవలో మరో ఐఏఎస్ అధికారి... తిరుపతి టిక్కెట్‌పై కన్ను

ఆదివారం, 30 జులై 2023 (15:46 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో మరో ఐఏఎస్ అధికారి తరిస్తున్నారు. తిరుపతి లోక్‌సభ స్థానం టిక్కెట్‌పై కన్నేసిన ఆయన సీఎం జగన్ సేవలో తరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ ప్రస్థానానికి అనువుగా ఉండేలా... టీటీడీ బోర్డులో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా కొనసాగేలా, దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి దక్కించుకున్నారని సమాచారం. విశేషమేమిటంటే... కరికాల వలవన్‌కు పది రోజుల కిందటే ఈ పోస్టింగ్ వచ్చింది. ఆగస్టు నెలాఖరుతో ఆయన రిటైర్ అవుతున్నారు. కానీ... అసాధారణ రీతిలో జగన్ సర్కారు ఆయన్ను ఏడాదిపాటు అదే పోస్టులో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
అంటే... ఆయన ఎంచక్కా ఎక్స్‌అఫిషియో మెంబర్ హోదాలో టీటీడీలో కొనసాగుతూ, తిరుపతిలో తన రాజకీయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు! కరికాల వలవన్ తమిళనాడుకు చెందిన అధికారి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న తిరుపతి లోక్‌సభ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ తరపున ప్రచారం చేసేందుకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ జనంలోకి వెళ్తున్నారు. ఆయన కూడా వైసీపీ తరపున బరిలో దిగాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు