ఆన్‌లైన్‌లో భార్యను అమ్మకానికి పెట్టిన కలియుగ హరిశ్చంద్రుడు... తర్వాత?

గురువారం, 4 జూన్ 2020 (15:32 IST)
పురాణాల్లో కట్టుకున్న భార్యను విక్రయానికి పెట్టాడు సత్యహరిశ్చంద్రుడు. ఇపుడు అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఈ కలియుగ హరిశ్చంద్రుడు తన భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. పైగా, ఆమె ఫోను నంబరును కూడా ఇచ్చాడు. అంతే... ఆమెకు విపరీతంగా ఫోన్లు రావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెహ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పునీత్‌ అనే వ్యక్తి తన భార్యను కొంత కాలంగా వేధిస్తూ వచ్చాడు. ముఖ్యంగా వరకట్నం కింద బైక్‌ కావాలని, ఇందుకోసం పుట్టింటి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వాలంటూ డిమాండ్ చేయసాగాడు. భర్త వేధింపులు భరించలేని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అయితే, తన భార్యకు ఎలాగైనా వేధించాలని కంకణం కట్టుకున్న పునీత్... తన భార్యను అమ్మేస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన ఇచ్చాడు. ఆమె ఫొటోను, ఫోను నంబరును పోస్టు చేశాడు. ఆమె కావాలనుకున్న వారు డబ్బులు చెల్లించాలని, ఆమెతో మాట్లాడటానికి, సమయం గడపటానికి సంప్రదించాలని కోరాడు. 
 
దీంతో ఆమెకు చాలా మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త పునీత్‌ను పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు