గత నెలలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లో ఉన్న భారత ఆర్మీ క్యాంపుపై తీవ్రవాదులు దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చిన విషయం తెల్సిందే. ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు సరికొత్త టెక్నిక్‌ను ఉపయోగించారు. కేవలం రెండు నిచ్చెనల సాయంతో వీరు భారత భూభాగంలోకి అడుగుపెట్టారు.
ముందుగా ఒక ఉగ్రవాది ఒక నిచ్చెనను తీసుకుని.. సలామాబాద్ నల్లా ప్రాంతం వద్ద నియంత్రణ రేఖ కంచెకు ఉన్న ఖాళీల గుండా భారతవైపు చొరబడ్డాడు. ఇటువైపు రాగానే ఆ నిచ్చెనను కంచెకు అమర్చాడు. భారీస్థాయిలో ఆయుధాలు, పెద్ద ఎత్తున ఆహారపదార్థాలు, ఇతర సామగ్రితో సిద్ధంగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు.. అటువైపు నుంచి మరో నిచ్చెనను భారత వైపున్న నిచ్చెనకు ఆనించి పెట్టారు.
దీంతో అటు నుంచి నిచ్చెన ఇక్కి.. ఇటు వైపు నిచ్చెన మీదుగా భారతలో చొరబడి ఉరీలోకి అడుగుపెట్టారు. భారతవైపు వేసిన నిచ్చెనను.. తమతోపాటు నియంత్రణ రేఖ దాకా వచ్చిన ఇద్దరు గైడ్‌లు కబీర్ అవన్, బషరత్‌లకు ఇచ్చి పంపేశారు. యురీ ఉగ్రదాడిపై దర్యాప్తులో ఈ విషయాలు తెలిసినట్టు అధికార వర్గాల సమాచారం.