ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ - ఎస్పీ పొత్తు పొడిచింది... కాంగ్రెస్‌కు 105, ఎస్పీకి 298

ఆదివారం, 22 జనవరి 2017 (12:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకోవడంతో ఈ పొత్తు పొడిచింది. ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. 
 
వాస్తవానికి శనివారం వరకు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేవు. ఈ రెండు పార్టీల మధ్య పోటీ చేసే సీట్ల పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోగా, కాంగ్రెస్ అధినేత్రి స్వయంగా కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. 
 
ఇదే అంశంపై అఖిలేష్‌తో సోనియా గాంధీ మాట్లాడగా, తొలుత ఆఫర్ చేసిన 99 స్థానాలతో పాటు మరో ఆరు స్థానాలను అధికంగా ఇచ్చేందుకు అఖిలేష్ వర్గం సమ్మతించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లను ఇచ్చేందుకు సమాజ్ వాదీ అంగీకరించింది. తాము 298 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి