ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు - ప్రమాదకరంగా గంగానది

ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:53 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రంలోని నదులనీ పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరదలు ముంచెత్తాయి. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 
 
కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో గంగోత్రి జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. గంగానది ప్రమాదకర స్థాయిని మించి 10 సెం.మీ ఎత్తులో ప్రవహిస్తోందని, నీటి మట్టం ఇంకా పెరుగుతూనే ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. 
 
గంగా ఉపనది అయిన హెన్వాల్‌లో కూడా నీటి మట్టం పెరిగిందని, దీంతో సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
దీంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర యంత్రాంగం ఆదేశించింది. భారత వాతావరణ శాఖకు చెందిన సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం.. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ తూర్పు ప్రాంతం, మధ్యప్రదేశ్‌ పశ్చిమప్రాంతాలు వచ్చే 24 గంటల్లో వరదముప్పును ఎదుర్కోవచ్చని హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు