ప్రియాంకా రాయబారం.. చేతులు కలుపనున్న గాంధీ సోదరులు

మంగళవారం, 28 నవంబరు 2017 (11:56 IST)
కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీ మారనున్నారా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. కాంగ్రెస్ తన అక్క ప్రియాంకా గాంధీ జరిపిన రాయబారంతో వరుణ్ గాంధీ.. బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. 
 
ప్రస్తుతం వరుణ్‌ ఉత్తరప్రదేశ్‌‌లోని సుల్తాన్‌ పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుణ్‌ గాంధీని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ తనదైన ప్రయత్నాలు చేసి విజయం సాధించారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ చేరిక ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే వరుణ్ గాంధీ తల్లి, కేంద్ర మంత్రిగా ఉన్న మేనకా గాంధీ నిర్ణయమే కీలకమని తెలుస్తోంది. 
 
నిజానికి గత యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నా, కావాలనే బీజేపీ పక్కన బెట్టిందని, ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో విజయం అనంతరం వరుణ్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని వార్తలు రాగా, చివరికి అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. 
 
పైగా, గత కొంతకాలంగా వరుణ్ గాంధీకి బీజేపీ నేతలు పెద్ద ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వరుణ్ గాంధీ గత కొన్ని రోజులుగా మీడియాకు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ జరిపిన మంత్రాంగం వల్ల ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు