భారత నౌకాదళ కొత్త అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ హరికుమార్‌

బుధవారం, 10 నవంబరు 2021 (17:24 IST)
భారత నౌకదళానికి కొత్త అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ నెల 30న ప్రస్తుత భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అదే రోజున వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
కాగా, 1962 ఏప్రిల్‌ 12న జన్మించిన వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ 1983లో భారత నౌకదళంలో చేరారు. 39 ఏళ్లలో ఆయన కమాండ్‌, స్టాఫ్‌ విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్‌ఎస్‌ నిషాంక్‌, మిస్సైల్‌ కార్వెట్‌, ఐఎన్‌ఎస్‌ కొరా, గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ రణ్‌విర్‌కు కమాండింగ్‌ అధికారిగా పనిచేశారు. నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు నాయకత్వం వహించారు. ఈ నెల 30వ తేదీ భారత నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు