తృటిలో తప్పిన ప్రమాదం : బిజీ రోడ్డులో ఉన్నట్టుండి పడిపోయిన్ ఐరన్ పిల్లర్

బుధవారం, 28 జూన్ 2023 (16:02 IST)
కర్నాటక రాష్ట్రంలో అత్యంత బిజీగా ఉండే రహదారిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వాహన రాకపోకలు అధికంగా ఉండే రోడ్డుపై ఓ ఐరన్ పిల్లర్ ఉన్నట్డి విరిగి పడిపోయింది. ఇది కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందే ఓ వాటర్ ట్యాంకర్ అటుగా వెళ్ళిపోయింది. ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు  దాటుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత బైక్‌లు, వాటి వెనకే ఓ బస్సు అటువైపే వెళుతున్నాయి. 
 
ఇంతలో పిల్లర్ కూలిపోతుండడం గమనించి బైకర్లతో పాటు వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఒక్క క్షణం అటూ ఇటూగా అయినా వాహనదారులు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అడుగుదూరంలో కళ్లముందే పెద్ద ఐరన్ పిల్లర్ కూలడంతో ఆ బైకర్లు షాక్‌కు గురయ్యారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. 
 
ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం, ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే అండర్ బ్రిడ్జి ముందు ఈ పిల్లర్‌ను అధికారులు ఏర్పాటుచేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాలకు ఎత్తుకు సంబంధించిన హెచ్చరిక చేస్తూ ఏర్పాటు చేసిన పిల్లర్ ఇది. 
 
ఇటీవల పలు వాహనాలు ఢీ కొట్టడంతో పిల్లర్ బలహీనంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే రోడ్డు కావడంతో వాహనాల రాకపోకల సందర్భంగా ఏర్పడే వైబ్రేషన్‌కు పిల్లర్ మరింత బలహీనంగామారి ఉన్నట్టుండి కూలిపోయిందన్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు