కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు మృత్యువాతపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో జిల్లాలోని ఉరవకొండ, చిన్న ముుష్టూరుకు చెందిన దంపతులు, వారి కుమార్తె చనిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
చిన్న ముష్టూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరాములు అనే వ్యక్తి కుమారుడు శ్రీకాంత్ (41), కోడలు ప్రతీక్ష (35)లు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి గమ్య (4) అనే కుమార్తె, దైవిక (2) అనే కుమారుడు ఉన్నాడు.
కుమారుడిని అనంతపురంలో ఉంటున్న అమ్మమ్మ వద్ద విదిలిపెట్టిన దంపతులు.. శుక్రవారం రాత్రి కుమార్తెతో కలిసి బెగుళూరుకు కారులో బయలుదేరి, మధ్యలో ధర్మస్థలం మంజునాథ స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ శనివారం స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని కారులోనే శృంగేరికి బయలుదేరారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉడిపి జదిల్లా కార్కల ఠాణా పరిధిలో ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, ప్రతీక్షతో పాటు వారి కుమార్తె గమ్య కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ తల్లిదండ్రులు, అత్తమామలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.