చిన్నమ్మను రహస్యంగా కలిసిన విజయమ్మ.. విలీనానికి 2 నెలల గడువు ఇచ్చిన దినకరన్..?

మంగళవారం, 6 జూన్ 2017 (12:46 IST)
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన నేరానికి బెంగళూరులోని పరప్పన జైలులో ఊచలు లెక్కిస్తున్న శశికళతో ఆమె మేనల్లుడు టి.టి.వి.దినకరన్‌ సోమవారం సాయంత్రం ములాకత్‌ నిర్వహించారు. ఆ ఇద్దరూ కొద్దిసేపు రాజకీయాంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.

కారాగారానికి వచ్చే మేందే దినకరన్‌ను (53) పార్టీ ఉపాధ్యక్షునిగా శశికళ నియమించారు. ఆ తరువాత కొద్ది వారాలకే ఏఐడీఎంకే పార్టీ చిహ్నం- రెండాకులను దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు రూ.50 కోట్ల లంచాన్ని ఇవ్వజూపారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. గత వారం బెయిల్‌పై విడుదలయ్యారు. 
 
జైలులో చిన్నమ్మను కలిసే ముందు మీడియాతో మాట్లాడిన దినకరన్‌.. తనను పార్టీ నుంచి తొలగించే అధికారం పార్టీ ప్రధాన కార్యదర్శికి మినహా ఇతరులు ఎవరికీ లేదన్నారు. తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఉందన్నారు. తనను తొలగించినట్లు జయకుమార్‌ చెబుతున్నారని, ఆయనకు ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిలా జయకుమార్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 
 
పార్టీలో తలెత్తే పరిణామాలను ఎలా సరిదిద్దుకోవాలో తమకు తెలుసన్నారు. అన్నాడీఎంకే చీలికవర్గాల విలీనంపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారని, వాటి విలీనం కోసమే 45 రోజులపాటు తాను పార్టీకి దూరంగా ఉన్నానని తెలిపారు. అయినా విలీన వ్యవహారంలో పురోగతిలేదని, అందువల్లే మళ్లీ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నానని పేర్కొన్నారు. 
 
శశికళ సూచనల మేరకు చీలికవర్గాల విలీనానికి మరో రెండు నెలల అవకాశమిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర మంత్రులు భయంతో తన గురించి మాట్లాడుతున్నారని, ఆ భయం ఎవరి వల్ల కలిగిందనే విషయం కాలక్రమంలో వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో దినకరన్ చిన్నమ్మను కలిసి వెళ్ళాక.. శశికళను ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి రహస్యంగా కలుసుకున్నారు. చిన్నమ్మను బెయిల్ పై విడుదల అయిన దినకరన్ కలిసి బయటకు వచ్చిన తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో ఆమె జైల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా విజిటింగ్ టైమ్ పూర్తయ్యాక విజయమ్మ చిన్నమ్మను కలుసుకోవడం వివాదానికి దారితీసింది.
 
శశికళ జైల్లో, దినకరన్ బెయిల్‌పై ఉన్న సమయంలో... పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మను విజయశాంతి కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వెబ్దునియా పై చదవండి