వికాస్ దూబేకు కరోనా సోకిందా? పోస్టుమార్టం రిపోర్టు ఏంటి? - ప్రభుత్వమే బోల్తాపడే ఛాన్సుంది...

శుక్రవారం, 10 జులై 2020 (16:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులను ముప్పతిప్పలు పెట్టి, గడగడలాడించిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌కు 40 కిలోమీటర్ల శివారు ప్రాంతంలో వికాస్ దూబే పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్చి చంపారు. ఆయన మృతదేహానికి కాన్పూర్ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేశారు. 
 
ఉజ్జయిని నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా, పోలీసులపై దాడికి యత్నించిన దూబేను కాల్చి చంపారు. కాగా, కాన్పూర్ ఆసుపత్రిలో ఈ గ్యాంగ్‌స్టర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను వీడియోలో బంధించారు. అతడి మృతదేహంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దూబే మృతదేహానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, అతడికి కరోనా సోకలేదని తేలింది.
 
మరోవైపు వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై యూపీకి చెందిన విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అతడికి బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఎన్‌కౌంటర్ చేశారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
నిజానికి కారు బోల్తా పడలేదని.. అతడి ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా పడే అవకాశం ఉండడంతో అలా జరగకుండా చర్యలు తీసుకున్నారని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ చురకలంటించారు. 
 
నేరస్తుడు చచ్చిపోయాడు సరే.. మరి అతడు చేసిన నేరాలు, అందుకు సహకరించిన వారి సంగతేంటి? అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు. 
 
కాగా, దీనిపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. 'చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా' అని ట్వీట్ చేశారు. అందుకే, బతికి ఉన్నవారు ఈ విషయంపై కథలు చెబుతున్నారనేలా ఈ వ్యాఖ్య చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు