ప్లీజ్.. మా పెళ్లికి ఎవరూ రాకండి... దయచేసి అర్థం చేసుకోండి.. ఇందుకు చింతిస్తున్నాం!

బుధవారం, 13 జులై 2016 (15:36 IST)
ప్లీజ్.. మా పెళ్లికి ఎవరూ రాకండి.. దయచేసి అర్థం చేసుకోండి!.. ఈ తరహా ప్రకటనలు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రచురితమయ్యే అన్ని పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ఈ తరహా ప్రకటనలు ఈ రాష్ట్రంలో దర్శనమివ్వడానికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ బాయ్ బుహ్రాన్ వానీని భద్రతా బలగాలు హతమార్చాయి. అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం అట్టుడికిపోతోంది. దీంతో కాశ్మీర్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. కశ్మీర్‌ లోయ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడి పేపర్లలో వింత ప్రకటనలు దర్శనమిచ్చాయి.
 
సాధారణంగా, ఈ రంజాన్‌ మాసంలోనే చాలా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగాల్సి ఉంది. అందుకోసం ఏర్పాట్లు కూడా చాలామంది చేసుకున్నారు. బంధువులకు, స్నేహితులకు శుభలేఖలు పంపించారు కూడా. అయితే, ఎవరూ ఊహించని విధంగా కాశ్మీర్ లోయలో చెలరేగిన అల్లర్లతో వారు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోవడం కంటే రద్దు చేసుకోవడమే ఉత్తమని భావించి, ఈ విషయాన్ని పత్రికల్లోని క్లాసిఫైడ్‌ యాడ్స్‌ ద్వారా బంధువులకు తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని పేపర్లలోనూ ఇలాంటి ప్రకటనలే కనబడుతున్నాయి. ‘మా వివాహం రద్దయింది. ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇందుకు చింతిస్తున్నా’మంటూ క్లాసిఫైడ్‌ రూపంలో ప్రకటనలు ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి