విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణలో వెనక్కి తగ్గేది లేదు.. కేంద్రం

సోమవారం, 2 ఆగస్టు 2021 (23:03 IST)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు మద్దతు పలికారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసే నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ ఈ ధర్నాలో పాల్గొన్నారు. “సేవ్ వైజాగ్ స్టీల్” అంటూ ప్లకార్డులతో నినదించారు.
 
మరోవైపు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. స్టీల్ ప్లాంట్ కు భూములిచ్చిన వారి వివరాలను రాష్ట్ర సర్కారు అఫిడవిట్ లో పొందుపరచలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా, తమకు సమయం కావాలంటూ ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ క్రమంలో, తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
 
కాగా ఈ కేసులో గత వారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని, దేశ ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి ఉంటుందని ఆ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవంది. ఈ అంశంలో పిల్ దాఖలు చేసిన లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో పోటీ చేశారని, విశాఖలో రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ దాఖలు చేశారని కేంద్రం ఆరోపించింది. ఇలాంటి పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోరింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది.

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎంపీ సజ్దా అహ్మద్‌ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు