బాదం పాలిచ్చారు.. మొత్తం దోచుకున్నారు.. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడి నిలువు దోపిడి

గురువారం, 11 ఆగస్టు 2016 (13:45 IST)
రైల్లో ప్రయాణించే సమయంలో ఇతరులపట్ల అప్రమత్తంగా ఉండాలని, తోటి ప్రయాణికులు ఇచ్చే తినుబండరాలు, శీతలపానీయాలు స్వీకరించకూడదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... కొంతమంది అమాయక ప్రయాణికులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి ఎదురైన చేదు అనుభవాన్ని పరిశీలిస్తే... 
 
కరీంనగర్‌ జిల్లా కట్టరాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త పారిపల్లి మనోహర్‌ వ్యాపారంలో భాగంగా మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు బయలుదేరాడు. రాత్రి 8 గంటల సమయంలో రైలు భోపాల్‌కు చేరుకోగానే, అక్కడ ఇద్దరు ఆగంతకులు కోచ్‌లోకి ఎక్కారు. ఇందులో ఒకరు వాటర్‌ బాటిళ్లు అమ్ముతుండడంతో మనోహర్‌ వాటర్‌ బాటిల్‌ కొనుక్కున్నాడు. మరో ఆగంతకుడు తన వద్ద ఉన్న బాదం పాలును మనోహర్‌కు ఇవ్వగా తీసుకునేందుకు అంగీకరించలేదు. 
 
కానీ, బలవంతం చేయడంతో మనోహర్‌ తీసుకుని అపుడే తాగాడు. అయితే, అవి మత్తు పదార్థం కలిపినవి కావడంతో మనోహర్‌ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన ధరించిన బంగారు ఆభరణాలు, వాచీ, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లు దోచుకుని ఆ ఆగంతకులు దిగిపోయారు. కానీ, బుధవారం ఉదయం 10 గంటలకు రైలు రామగుండంకు చేరుకున్న సమయంలో మత్తు వీడి లేచి చూసుకునే మనోహర్‌కు జరిగిన విషయం బోధపడింది. మనోహర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి