పెళ్లికి భారీ సంఖ్యలో బంధువులు.. అన్నం ఎక్కువగా వండలేదని గొడవ.. పెళ్లే వద్దన్న వధువు..

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (12:32 IST)
బెంగళూరులో ఓ పెళ్లి రద్దయ్యింది. గతంలో వరుడి తరుపువారు మటన్ బిర్యానీ వండాలని పట్టుబట్టారు. కానీ వధువు తరుపువారు మాత్రం చికెన్ బిర్యాని వడ్డించడంతో పెళ్లి రద్దయింది. తాజాగా బెంగళూరులో వరుడి తరపు వారు చెప్పిన వారికంటే ఎక్కువ మంది వివాహానికి హాజరు కావడం వారికోసం వంట చేసే విషయంలో ఇరు తరపు వారికి ఏర్పడిన వివాదం పెళ్లి రద్దుకు కారణం అయ్యింది.  
 
వివరాల్లోకి వెళితే, బెంగుళూరులోని కోణనెకుంటెలో ఉన్న సౌదామిని కళ్యాణ మండపంలో నాగేంద్రప్రసాద్ అనే వరుడికి ఓ యువతితో వివాహ నిశ్చయమైంది. ఆదివారం నాడు వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడి తరపువారు ఓవరాక్షన్ చేశారు. తమ తరుపు బంధువులకు సరిపోయేంత భోజనం వండలేదని వరుడి తరుపువారు వధువు కుటుంబ సభ్యులతో పేచీకి దిగారు. కానీ వధువు తరపు వారు మరోసారి వంట చేస్తామని నచ్చజెప్పారు. 
 
కానీ వరుడి కుటుంబీకుల ఆగ్రహం ఏమాత్రం చల్లారలేదు. నిజానికి వరుడి తరుపువారు చెప్పిన సంఖ్య కన్నా ఎక్కువ మంది హాజరవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని వధువు కుటుంబ సభ్యులు వాదించినా.. వారి వాదనను పట్టించుకోలేదు. దీనిపై ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. చివరికి వరుడి తరపు వారు తగ్గినా.. వధువు మాత్రం తనకు ఈ పళ్లి వద్దని తెగేసి చెప్పింది. 
 
పెళ్లికి ముందే ఇలా వ్యవహరించిన వారు ఇక పెళ్లయితే ఎలా ఉంటారోనన్న అనుమానం వ్యక్తం చేస్తూ పెళ్లి రద్దుచేయాల్సిందిగా పెళ్లి కుమార్తె స్పష్టం చేసింది. ఇరు వర్గాల వారు ఆమెకు ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. వరుడు కూడా భోజనం రుచిగా లేదని తల్లిదండ్రులతో కలిసి కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయాడు. వరుడు, వారి తల్లితండ్రులకు ఎంత నచ్చజెప్పినా.. ప్రయోజనం లేకపోయింది. ఒక దశలో వరుడింటివారు ఒప్పుకున్నా వధువు తనకు ఈ పెళ్లి వద్దని తెగేసి చెప్పడంతో ఈ పెళ్లి ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లి ఆగిపోవడం తమ బిడ్డకు మంచిదే అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి