కర్ణాటక రాష్ట్ర డీఐజీ నీలమణి రాజుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆమె కోపాన్ని దగ్గరనుంచి చూసిన మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమార స్వామిలు బిత్తరపోయారు. ఇంతకీ కర్ణాటక డీజీఐపీ మమతా బెనర్జీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.. వీడియో చూడండి.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమార స్వామి బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఆ రాష్ట్ర విధాన సౌథ ముందు జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అనేక మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. దీంతో ఇది ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలాకాకుండా, బీజేపీయేతర పార్టీల బలప్రదర్శనగా మారిపోయింది. పైగా, వేదికపై నేతలంతా కుశల ప్రశ్నలు సంధించుకుంటూ, ఆలింగనాలు చేసుకుంటూ కనిపించడంతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహం సాగింది.
ప్రమాణస్వీకారం కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్న మమత నేరుగా విధానసౌథకు బయలుదేరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీవీఐపీలు, కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు హాజరుకావడంతో ఆమె వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆ తర్వాత ఏదో విధంగా ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కి విధాన సౌథకు చేరుకున్నారు. వేదికపైకి వస్తూనే అక్కడ కనిపించిన డీఐజీ నీలమణి రాజుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏంటీ ఏర్పాట్లు? అంటూ చీవాట్లు పెట్టారు. ఆమె ఆగ్రహాన్ని చూసి కుమారస్వామి, దేవెగౌడ, ఇతర నేతలు బిత్తరపోయారు. పోలీస్ బాస్‌పై ఫైర్ అవుతున్న మమత వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.