వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసుతో సంబంధం నిందితుల్లో ఓ నిందితుడుని సొంత సోదరి పోలీసులకు పట్టించింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించిన మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో పారిపోయేందుకు సహకరించిన మరో యువకుడిని మంగళవారం అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.
నిందితుడి సోదరి ఇచ్చిన సమాచారంతోనే పరారీలో ఉన్న అతడిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదో నిందితుడు సఫీక్ దుర్గాపుర్‌లోని అందాల్ వంతెన కింద దాక్కున్నట్లు అతడి సోదరి రోజినా తమకు సమాచారం ఇవ్వడంతో అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. తన సోదరుడు చేసిన తప్పునకు తగిన శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతోనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు రోజినా మీడియాకు తెలిపింది.
అత్యాచార ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ భయానక క్షణాలను గుర్తు చేసుకుంది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు పలువురు దుండగులు తమను వెంబడించినట్లు తెలిపింది. వెంటనే తాము అడవి వైపు పరిగెత్తుతున్న సమయంలో తన స్నేహితుడు మరో వైపునకు వెళ్లగా.. నిందితులు తనను బలవంతంగా అటవీప్రాంతంలోకి లాక్కెళ్లినట్లు పేర్కొంది. ఫోన్‌ను లాక్కొని తన స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించారని.. అతడు రాకపోవడంతో తనపై దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది.
తాను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుండగా..అరిస్తే మరికొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని.. విచారిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లి, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.