దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ దగ్గు మందు కోల్డ్‌రిఫ్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కల్తీ మందును తయారు చేసిన ఫార్మా కంపెనీ యజమానిని తమిళనాడు పోలీసుల సహకారంతో మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కల్తీ దగ్గు మందు తాగి 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. కాంచీపురంలోని శ్రీసన్ అనే ఫార్మా కంపెనీ ఈ మందును తయారు చేసింది. దీంతో ఆ కంపెనీ యజమాని జి.రంగనాథను మధ్యప్రదేశ్ పోలీసులు చెన్నైలో గురువారం అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున కోడంబాక్కంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని, గుణ, శివపురి జిల్లాల్లో 'కోల్డ్‌రిఫ్' అనే దగ్గు మందును వాడిన తర్వాత సుమారు 20 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకుగురై ప్రాణాలు కోల్పోయారు. ఈ మందును తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంగువార్ చత్రంలో ఉన్న 'శ్రీసేన్ ఫార్మా' అనే యూనిట్ తయారు చేసింది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, ల్యాబ్ పరీక్షల కోసం సిరప్ నమూనాలను పంపించారు. ఈ పరీక్షల్లో సిరప్ 'డైఇథిలిన్ గ్లైకాల్' (డీఈజీ) అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. సాధారణంగా పెయింట్లు, ఇంకుల తయారీలో వాడే ఈ రసాయనం వల్ల చిన్నారుల్లో కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని మరణాలు సంభవించాయని అధికారులు నిర్ధారించారు.
జలుబు, దగ్గు కోసం వైద్యులు సూచించిన ఈ సిరప్ వాడిన కొన్ని రోజులకే చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన చికిత్స అందించినప్పటికీ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది చిన్నారులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషాద ఘటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే 'కోల్డ్ రిఫ్' సిరప్ అమ్మకాలు, పంపిణీపై నిషేధం విధించింది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా ఈ మందు అమ్మకాలను నిలిపివేయాలని, అందుబాటులో ఉన్న స్టాక్‌ను స్వాధీనం చేసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.