ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్‌మెహర్ కౌర్ మంగళవారం స్పష్టంచేసింది. ప్రచారంపై తీవ్ర వ్యతిరేకతతోపాటు అత్యాచార, హత్య బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రచారాన్ని విరమించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నా ధైర్యసాహసాలను ప్రశ్నించేవారికి అవసరమైనదానికంటే ఎక్కువే సమాధానమిచ్చా’ అని ట్వీట్ చేసింది. తన కుటుంబంతో కలసి ఉండేందుకు ఆమె జలంధర్‌కు వెళ్లింది. ఆమెకు రక్షణ కల్పించాలని అక్కడి పోలీసులను ఢిల్లీ పోలీసులు కోరారు.
మరోవైపు.. ఢిల్లీ వర్సిటీ నార్త్ క్యాంపస్‌లో ఏబీవీపీకి వ్యతిరేకంగా మంగళవారం జేఎన్ యూ, డీయూ, జామియా వర్సిటీలకు వందలాది విద్యార్థులు, అధ్యాపకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి గుర్‌మెహర్ కౌర్ గైర్హాజరైంది. కౌర్‌కు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై.. లైంగిక వేధింపులు, బెదిరింపుల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
కాగా, ర్యాలీలో ఇద్దరు ఏఐఎస్‌ఏ విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలపై ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌర్ వ్యాఖ్యలపై తాను చేసిన ట్వీట్ సరదా కోసమేనని, దాన్ని అపార్థం చేసుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. అయితే కౌర్ వ్యాఖ్యలను ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ ఖండించారు. కౌర్, హిట్లర్, లాడెన్ ల ఫొటోలను జతచేసి దత్ పోస్ట్ చేశారు.