ఇటీవలి కాలంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. ముఖ్యంగా అమెరికా గడ్డపై ఇతర దేశాల పౌరులకు నివశించే హక్కు లేదనేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వలసవాదులపై ఆయన ఆంక్షలు విధించారు. దీంతో అక్కడ వివక్షాపూరిత దాడులు పెరిగాయని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కెన్సాస్‌లో తెలుగు యువకులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌథం స్పందించింది. వలసవాదులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు కెన్సాస్‌లో తెలుగు యువకులపై కాల్పుల ఘటనకు లింకు పెట్టడం అనుచితమని తెలిపింది.
ఇదిలావుండగానే.. కెన్సాస్ కాల్పుల ఘటన జరగడంతో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ సర్కారు తీరుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తడం మొదలైంది. దీంతో వైట్‌హౌస్ స్పందించింది. ‘‘ఎవరు చనిపోయినా.. అది శోచనీయం. అయితే కెన్సాస్ ఘటనను ట్రంప్‌కు లింక్ పెట్టడం అసంబద్ధం.’’ అని శ్వేతసౌథం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ పేర్కొన్నారు.