కట్నం కోసం బాలింతను కొట్టి చంపేశారు.. రెండు నెలల క్రితమే పాప పుట్టింది..

శనివారం, 9 జనవరి 2021 (16:36 IST)
వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ బాలింతను భర్త, అత్తమామలు కొట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లా తానాభవన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోర్ మజ్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త, అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారంటూ తమ కూతురు ఫోన్ చేసిందని, తాము తమ బిడ్డను రక్షించుకుందామని వచ్చేసరికే శవమై పడివుందని మృతురాలి తల్లిదండ్రులు విలపించారు.
 
ఏడాదిన్నర క్రితం అన్ని రకాల కట్న కానుకలతో తమ బిడ్డను మెట్టింటికి సాగనంపామని, పెండ్లి జరిగిన నెల నుంచే అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయని అన్ను తల్లిదండ్రులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తమ కూతురు చెప్పినప్పుడల్లా సర్దిచెబుతూ వచ్చామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. రెండు నెలల క్రితమే తమ బిడ్డ ఒక పాపకు జన్మనిచ్చిందని, పచ్చిబాలింత అని కూడా చూడకుండా అత్తింటివారు వేధించి చంపారంటూ విలపించారు.
 
కాగా, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు