ఒబామా న్యాయం చేయండి : సిక్కు సంస్థల లేఖ

FILE
సిక్కుల ఊచకోతలో బలైపోయిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలని.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని కోరుతూ, ఆ మతానికి చెందిన రెండు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. భారత ప్రధాని మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా సిక్కుల ఊచకోత అంశాన్ని లేవనెత్తి, తద్వారా బాధితులకు న్యాయం చేకూరేలా, ఒత్తిడి తీసుకురావాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.

అమెరికాలోని సిక్కుల న్యాయ పరిరక్షణ మానవ హక్కుల సంస్థ, పంజాబ్‌లోని ఆల్ ఇండియా సిక్కు విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎస్ఎఫ్) అనే రెండు సంస్థలు బరాక్ ఒబామాకు పై లేఖను రాశాయి. 1984వ సంవత్సరంలో సిక్కులను లక్ష్యంగా చేసుకుని జరిగిన నరమేథంలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆ లేఖలో పై సంస్థలు వివరించాయి.

కాగా... వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ఒబామా ఇచ్చే తొలి ఆతిథ్య విందులో పాల్గొనేందుకుగానూ భారత ప్రధాని మన్మోహన్ అమెరికాకు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... 1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని స్వయానా ఆమె అంగరక్షకులైన సిక్కులు కాల్చి చంపటంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి విదితమే. నాలుగు రోజులపాటు సాగిన ఊచకోతలో ఢిల్లీతో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో వేలాదిమంది సిక్కుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

వెబ్దునియా పై చదవండి