నితిన్ చివరి వీడియోను విడుదల చేసిన ఆసీస్

FILE
భారతీయ విద్యార్థి నితిన్ గార్గ్ హత్య కేసుకు సంబంధించిన చివరి వీడియోను ఆస్ట్రేలియా పోలీసులు విడుదల చేశారు. నితిన్ హత్యపై దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు ఇందులో భాగంగా, నితిన్ కదలికలతో కూడిన సీసీటీవీ వీడియోలను పోలీసులు విడుదల చేశారు.

ఈ వీడియో టేపులను చూసిన ప్రజల నుంచి ఏదో ఒక క్లూ దొరకుతుందన్న ఆశాభావంతో వాటిని పోలీసులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి తెలిసిన ఎంత చిన్న సమాచారం అయినా తమకు అందించాలని పోలీసులు ఈ సందర్భంగా స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. జనవరి 2వ తేదీన ఫుట్‌స్క్రేలోని హంగ్రీ జాక్స్ రెస్టారెంట్ సమీపంలో పంజాబ్‌కు చెందిన 21 సంవత్సరాల నితిన్ గార్గ్ హత్యకు గురయ్యాడు. ఆరోజు రాత్రి యారవిల్లే యారవిల్లే రైల్వేస్టేషన్‌కు వచ్చిన నితిన్ కదలికలు సీసీ టీవీలలో రికార్డయ్యాయి. వీటినే పోలీసులు విడుదల చేశారు.

వీడియో టేపులను విడుదల చేయటమే గాకుండా, ఆ ప్రాంతానికి వెళ్లి పలు రకాలుగా పోలీసులు పరిశీలించారు. కాగా... గత సంవత్సరం ఆస్ట్రేలియాలో వందమందికి పైగా భారతీయ విద్యార్థులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో మృతి చెందిన మొట్టమొదటి భారతీయ విద్యార్థి నితినే కావటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి