ప్రణబ్‌కు ఎన్నారై స్వరాజ్‌ పాల్ కితాబు...!

గ్రామీణాభివృద్ధికి ఊతం ఇచ్చేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని... ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌ పాల్ అభినందించారు. భారతదేశం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ చాలా బాగుందని, ఆర్థికమాంద్యం ప్రభావంతో ఉపాధి కరువైన వారికి ఇది ఆసరాగా నిలుస్తుందని ఆయన కితాబిచ్చారు.

ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకునే విధంగా ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రణబ్‌ను ఈ సందర్భంగా పాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఆహార భద్రత, ఉపాధి, గ్రామీణాభివృద్ధిలకు పెద్దపీట వేయడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశం మొత్తం వ్యతిరేకించినా, 1981లో ఎన్నారై పెట్టుబడిదారులకు ద్వారాలు తెరచిన ఘనత ప్రణబ్‌కే చెందుతుందని పాల్ ప్రశంసల వర్షం కురిపించారు.

అలాగే... ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తమ దేశంపై కూడా పడిందని భారత్ ఒప్పుకోవడాన్ని పాల్ స్వాగతించారు. పేద ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలను, ప్రభుత్వ కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగవకుండా, భారత్ అగ్రపథంలోకి దూసుకుపోలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... భారత సంతతికి చెందిన లార్డ్ స్వరాజ్ పాల్, ప్రస్తుతం బ్రిటన్ విదేశీ వాణిజ్య వ్యవహారాలకు రాయభారిగానూ, ప్రివ్వి కౌన్సిల్ సభ్యుడిగానూ విధులు నిర్వహిస్తున్న సంగతి పాఠకులకు విదితమే...!

వెబ్దునియా పై చదవండి