తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

ఠాగూర్

ఆదివారం, 6 జులై 2025 (10:18 IST)
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. 
 
ఉండ్రాజవరంలో కొలువైన వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని, అష్టైశ్వరాలు సిద్ధస్తాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 
 
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. తిరులమ శ్రీవారి ఆలయంలో సాధారణ భక్తులతో పాటు.. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన భక్తులు, వీఐపీల సంఖ్య అధికంగా ఉంది. 
 
తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? 
 
ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏకాదశి నుంచే పండుగలు ప్రారంభం అవుతాయి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 6వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే ప్రారంభదినంగా భావిస్తారు. చాతుర్మాసం ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది.
 
ఈ రోజున విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం.. సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ పవిత్ర రోజున ఉపవాసం వున్నవారు మాంసాహారం, మద్యపానం వంటి అశుద్ధ చర్యల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే, పగటి పూట నిద్రపోవడం, ఇతరులతో గొడవ పడటం, అపవాదాలు చేయడం వంటి నెగటివ్ పనులు చేయరాదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ దినాన విష్ణువు పూజ కోసం తులసి ఆకులు కావాలంటే వాటిని ముందే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.
 
ఈ పవిత్ర రోజున వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి శుభ్రతకూ ప్రాధాన్యత ఇవ్వాలి. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం వంటి చర్యలు ఈ రోజు నిషిద్ధం. ఇలాంటివి చేస్తే దారిద్ర్యం వెంటాడుతుందని, అశుభ ఫలితాలనూ కలిగించవచ్చునని చెబుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు