చాలా సంవత్సరాలుగా తాము నివసిస్తున్న గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న మలేషియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా... ప్రవాస భారతీయులు ర్యాలీ నిర్వహించారు. ఉత్తర పెనాంగ్‌లోని బుహ పాలా గ్రామంలో ఉంటున్న ప్రవాస భారతీయులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ, ఆ దేశ అధికారులు ఆదేశించారు.
గతంలో అధికారంలో ఉండగా ప్రతిపక్ష కూటమి తమ పట్ల వివక్షతో వ్యవహరించిందని ప్రవాస భారతీయులు ర్యాలీ సందర్భంగా ఆరోపించారు. కాగా... బుహ పాలా గ్రామంలో దాదాపు 300 మంది ప్రవాస కుటుంబాలు నివసిస్తున్నాయి. 150 సంవత్సరాల క్రితం నుంచి వీరు ఇక్కడ నివసిస్తున్నారు.
ఎలాంటి పరిహారాన్ని ఆశించకుండా ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని మలేషియా అత్యున్నత న్యాయస్థానం ప్రవాస భారతీయులను ఆదేశించటంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు నిరసనగానే తాము ఈ ర్యాలీని నిర్వహించామని పెనాంగ్‌కు చెందిన అనిల్ నెట్టో వెల్లడించారు.
తాము ఖాళీ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసిందనీ, ఇళ్ల కూల్చివేతను వాయిదా వేస్తారన్న ఆశాభావంతో రోజులు వెల్లదీస్తున్నామని పలువురు ఎన్నారైలు వాపోయారు. ఇదిలా ఉంటే... ఈ ప్రాంతాన్ని 2005వ సంవత్సరంలో ఒక ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అమ్మివేసింది. అయితే ఈ వ్యవహారం కాస్తా ప్రస్తుత పెనాంగ్ విపక్ష కూటమికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.