చంద్రబాబుకు మద్దతుగా తెలుగు ప్రజలు అమెరికాలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. అమెరికాలో న్యూజెర్సీలో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ రోజు అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నామంటే అదంతా చంద్రబాబు చేసిన కృషి వల్లే సాధ్యమైందని నిరసనలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు అన్నారు.
తెలుగుదేశం, జనసేన మద్దతుదారులతో పాటు పార్టీలకతీతంగా న్యూజెర్సీలో ఉంటున్న తెలుగు ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలనే నినాదాలతో న్యూజెర్సీ వీధుల్లో హోరెత్తించారు.
వియ్ వాంట్ జస్టీస్, వియ్ ఆర్ విత్ సీబీఎన్ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచం కీర్తించిన నాయకుడిని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన దార్శనికుడిని జైలులో పెడతారా అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు, ఉద్యోగులు నిలదీశారు. చంద్రబాబును విడుదల చేసే వరకు తాము కూడా బాబు అండగా ఉద్యమిస్తామని తెలిపారు.