అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధిని ప్రియాంక గోగినేని ప్రమాదవశాత్తు మరణించింది. సియాటెల్ లోని సెయింట్ మాట్రిన్ యూనివర్సీటీలో ప్రియాంక గోగినేని స్థానిక హిక్ లేక్‌లో ఈతకు వెళ్లింది. అయితే అక్కడే ప్రమాదవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె పార్ధీవ దేహాన్ని ఇండియాకు పంపించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన ప్రియాంక ఇలా అకస్మాత్తుగా మరణించిన వార్త తెలుసుకున్న అక్కడ ఆమె స్నేహితురాలు మణి పోతేపల్లి నాట్స్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేశారు.
ప్రియాంక పార్థీవ దేహాన్ని ఇండియాలోని ఆమె తల్లిదండ్రులకు పంపించేందుకు సహకరించాలని నాట్స్‌ని కోరారు. అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే నాట్స్ ప్రియాంక గోగినేని పార్ధీవదేహన్ని తల్లిదండ్రులకు అప్పగించేందుకు రంగంలోకి దిగింది. మణి పోతేపల్లి కుటుంబసభ్యుల సహకారంతో ప్రియాంక పార్థీవ దేహాన్ని ఇండియాకు పంపించేందుకు చేయాల్సిన అధికారిక వ్యవహారాలపై నాట్స్ దృష్టి పెట్టింది. దీని కోసం స్థానిక పోలీస్ అధికారులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు ఇండియాలోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి వారితో కూడా మాట్లాడుతోంది. వీలైనంత త్వరగా ప్రియాంక గోగినేని పార్ధీవ దేహాన్ని ఇండియాకు పంపించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తోంది.
ప్రియాంక గోగినేని కోసం నాట్స్ విరాళాల సేకరణ
ప్రియాంక గోగినేని పార్ధీవదేహాన్ని అమెరికా నుంచి ఇండియాకు పంపించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రియాంక స్నేహితురాలు.. నాట్స్‌ను ఆశ్రయించారు.. విషయం తెలుసుకున్న నాట్స్ వెంటనే రంగంలోకి దిగింది.. నాట్స్ సభ్యులందరిని దీనిపై స్పందించాలని కోరుతోంది. ప్రియాంక గోగినేని కోసం విరాళాలు సేకరించి త్వరగా పార్ధీవ దేహాన్ని ఇండియాకు పంపించే ఏర్పాట్లను వేగిరం చేసింది.