నాలుగు తరాలను ఒకే వేదికపై తెచ్చిన నాట్స్ వెబినార్: మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటిన నాట్స్

బుధవారం, 19 మే 2021 (21:51 IST)
డాలస్,టెక్సాస్: అమ్మ అంటే ప్రత్యక్ష దైవం.. అలాంటి అమ్మకు మాతృదినోత్సవం నాడు నీరాజనాలు పడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. నాలుగు తరాలకు చెందిన మహిళా మణులను ఒకే వేదిక పైకి తరం తరం అమ్మతనం పేరిట తెచ్చింది. ముది అమ్మ, అమ్మమ్మ, అమ్మ లతో పాటు నేటి తరం వనితలు కూడా ఆన్ లైన్ వేదికగా తమ అమ్మ తనం గొప్పతనాన్ని చాటారు.
 
అమ్మ చూపించే ప్రేమ, అమ్మతో అనుబంధాలు, అమ్మ లాలన, పాలన ఇవన్నీ నెమరు వేసుకున్నారు. అమ్మ ప్రేమపై  బొమ్మలు గీసి అమ్మకు కానుక ఇచ్చారు. మరికొందరు అమ్మను మించిన దైవమున్నదా అంటూ తమ పాటలతో అమ్మను కీర్తించారు. తమ అమ్మలతో పాటు కలిసి చిన్నారులు చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా ఈ వెబినార్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మలతో కలిసి చిన్నారులు చేసిన డబ్ స్మాష్‌కు విశేష స్పందన లభించింది.
 
పిల్లలు మాతృమూర్తి మీద వ్రాసిన కవితలు కూడా ఈ వెబినార్‌లో చదివి వినిపించారు. నాట్స్ జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం అనుసంధానకర్తగా మారి ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. నాట్స్ మహిళల కోసం చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి చక్కగా వివరించారు. అమ్మ ప్రేమ గురించి ఆమె తన అనుభవాలను వివరించారు. మాతృదినోత్సవం నాడు నాట్స్ చేపట్టిన తరం తరం.. అమ్మతనం కార్యక్రమాన్ని వందలాది తెలుగు మహిళలు వీక్షించారు. అమ్మప్రేమను గుర్తు తెచ్చుకుని తన్మయం చెందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు