ఒబామా సలహా సంఘంలో "ఇంద్రానూయి"..?

సోమవారం, 12 జనవరి 2009 (13:30 IST)
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన బరాక్ ఒబామా నియమించిన అధికార మార్పిడి సలహా సంఘంలో పెప్సీకో ఛైర్‌పర్సన్ ఇంద్రానూయికి చోటు కల్పించాలని అమెరికా-ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (యూఎస్ఐఎన్‌పీఏసీ) ఒబామాకు సూచించింది.

కాగా, అధికార మార్పిడి సలహా సంఘంలో కామర్స్ సెక్రటరీగా ఉన్న న్యూమెక్సికో గవర్నర్ బిల్ రిచర్డ్‌సన్ తన పదవి నుంచి ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. ఆయనకు బదులుగా ఇంద్రానూయిని నియమించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఒబామాకు యూఎస్ఐఎన్‌పీఏసీ విజ్ఞప్తి చేసింది.

ఈ విషయమై యూఎస్ఐఎన్‌పీఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఇంద్రానూయి సేవలను వినియోగించుకోవాలని ఒబామాను కోరారు. తన ప్రతిభా సామర్థ్యాలతో నూయి ఈ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చగలదని వారు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... 1994వ సంవత్సరంలో పెప్సీకో శీతల పానీయాల సంస్థలో చేరిన ఇంద్రానూయి... అకుంఠిత దీక్షతో, అద్భుతమైన ఫలితాలను సాధించి.. అంచెలంచెలుగా అనేక పదవులను అలంకరించారు. ప్రస్తుతం నూయి, ఈ సంస్థ సీఈవో బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి