ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తర్వాత మూడు, నాలుగు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఈ హింసపై ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ మహేష్ కుమార్‌లకు సమన్లు జారీచేసింది. దీంతో వారు గురువారం ఢిల్లీకి వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు. పైగా, ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది.
హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. దీనిపై శుక్రవారం రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ప్రతి ఘటనపైనా సిట్.. ఈసీకి నివేదిక ఇవ్వనుంది. దాడులకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశముంది.
విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న, కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది. ఘటనలు చోటుచేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అభ్యర్థులను గృహనిర్బంధంలో ఉంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద రెండంచెల నుంచి మూడంచెలకు భద్రత పెంచారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏపీ సీఈవో ఎంకే మీనా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.