అలనాటి సినీతార ఎస్. వరలక్ష్మి కన్నుమూశారు. బాలనటిగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి.. వయ్యారిభామలు వగలమారి భర్తలు, ముద్దులకృష్ణయ్య, సతీసావిత్రి, భామా విజయం, బొమ్మా బొరుసా, మాంగల్య బలం వంటి పలు తెలుగు సినిమాల్లో నటించింది.
"బాలయోగిని"లో బాలనటిగా పేరు సంపాదించిన వరలక్ష్మి, 1948 సంవత్సరంలో విడుదలైన "బాలరాజు" చిత్రం ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది.
తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే. కథానాయిక పాత్రలో పాటు కొత్తతరం సినిమాల్లోనూ తల్లి పాత్రలను పోషించింది. ప్రముఖ తమిళ నిర్మాత ఎ.ఎల్. శ్రీనివాసన్ (తమిళ రచయిత కణ్ణదాసన్ సోదరుడు)ను వివాహమాడిన వరలక్ష్మికి ఓ కుమారుడు, కుమార్తెలున్నారు.
ఇలా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన నటన, స్వరంతో ఆకట్టుకున్న వరలక్ష్మి మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరునెలలు బాధపడ్డారు.
మంగళవారం రాత్రి (సెప్టెంబర్ 22) చెన్నై మహాలింగపురంలోని ఆమె స్వగృహంలో రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారని కుటుంబీకులు తెలిపారు. వరలక్ష్మి మరణవార్తతో సినీలోకం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. వరలక్ష్మి మరణం పట్లు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.