ఆదాయానికి మించి ఖర్చుపెట్టకండి: ఎన్టీఆర్

ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదేలు చేస్తోంది. సరదాలు, సినిమాలు, పార్కులు, యాత్రలు చేసేవారు చెయ్యి కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత పరిస్థితిలో కాస్తంత పొదుపు చర్యలు పాటిస్తే... మాంద్యాన్ని ఎదుర్కొనవచ్చు. ఎలాగంటారా...? క్రిందనున్న ఈ చిన్న ఉదాహరణ చదవండి...

ఎన్టీరామారావుగారి గురించి గుమ్మడిగారు తన "తీపి గురుతులు- చేదు జ్ఞాపకాలు"లో ఒకచోట ఇలా రాశారు. " నాకు తెలిసి 1952లో సొంతకారు కొనేంతవరకూ ఆయన... అయితే బస్సు ప్రయాణం, లేదంటే కాలినడక. ఏనాడూ రిక్షా ఎక్కినట్లు చూడలేదు. ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించారు.

మేము ఒక రోజు అలా షికారుగా నడుస్తూ వెళుతుండగా యథాలాపంగా ' నెలకు నీకు ఖర్చు ఎంత అవుతుంది' అని అడిగారు. (అప్పటికి మేమిద్దరం మద్రాసులో కాపురం పెట్టలేదు. ఒంటరిగానే ఉంటున్నాము.)

నాలుగువందలు అవుతుంది అన్నాను. నాలుగువందలెందుకు...? అని ఆయన ప్రశ్నించారు. హోటల్‌కు, వారంలో నాలుగైదు ఇంగ్లీషు సినిమాలు చూసేందుకు, సిగరెట్లకూ... అని చెప్పాను. ఆ మాటలు విన్న రామారావుగారు.... మీకొచ్చే ఆదాయం ఎంతా...? అని ప్రశ్నించారు.

రెండు వందలు అని చెప్పాను. మరి ఖర్చు నాలుగు వందలు కదా.. మిగిలిని రెండు వందలు ఎక్కడ నుంచి తెస్తున్నారు అని అడిగారు.

మా తోడల్లుడు కోటేశ్వర్రావు పంపిస్తున్నార్లెండి అన్నాను నేను. దానికి ఆయన... " నో..నో.. మీ ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు పెట్టకండి. మీకొచ్చిన జీతంతోనే సరిపెట్టుకోవాలి. నాకొచ్చే జీతం ఐదు వందలు. అదికాక సినిమాకు మరో ఐదొందలు అదనంగా వస్తాయి. అంటే వెయ్యి రూపాయల సంపాదన.

అయితే నాకయ్యే ఖర్చు ఎంతో తెలుసా...? కేవలం వంద రూపాయలు. గది అద్దెకు రూ.50, క్యారియర్ రూ. 25, ఇతర ఖర్చులు మరో పాతిక రూపాయలు... మరి మీరు ఇలా ఖర్చు చేస్తే ఎలా అని అడిగారు. ఎన్టీఆర్ గారి బడ్జెట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఆ అలవాటును లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నప్పుడు కూడా పాటించేవారు"

వెబ్దునియా పై చదవండి