ఎండిపోయిన చెట్టుకు జీవం పోశారు: పద్మనాభం

WD
"నేను 1931లో పుట్టాను. కానీ ఈ రోజు నాకు జరుగుతున్న సన్మానం చూస్తుంటే ఈ రోజే పుట్టినట్లుంది. నా కోసం మూడు లక్షలు బహుమానంగా ఇచ్చారు. ఎండిపోయిన చెట్టుకుజీవం పోసినట్లుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని" అలనాటి హాస్యనటుడు పద్మనాభం అన్నారు.

బుధవారం హైదరాబాద్‌లో హాస్యనటీనటులు పద్మనాభాన్ని సన్మానించారు. నేటినాటితరాన్ని సన్మానించే కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది.

ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, రమాప్రభ, గీతాంజలి, ఏవీఎస్, భరణి, అలీ, శ్రీనివాసరెడ్డి, రామ్‌జగన్, చిట్టిబాబు, సుబ్బరాయశర్మ, ఎం.ఎస్. నారాయణ ఉత్తేజ్, గుండు హనుమంతరావు, గౌతంరాజు వేణుమాధవ్, డి. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ.. పద్మనాభం తాను మంచి జోడీ అని.. తమ కాంబినేషన్‌లో చాలా చిత్రాలు వచ్చాయన్నారు. అప్పుడు చేసిన సినిమాలు ఇప్పుడు టీవీల్లో చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అప్పట్లో ఇంత పరిశీలనగా చూసే అవకాశం రాలేదు. హాస్యనటునిగా మాత్రమే గాకుండా నిర్మాతగా మారిన పద్మనాభాన్ని సన్మానించడం ఆనందంగా ఉందని చెప్పారు.

తనికెళ్ళభరణి మాట్లాడుతూ.. అప్పటి సినిమాల్లో కేవలం సాంబారు అన్నం పెట్టేవారు. అయితే పద్మనాభం నిర్మాతగా మారిన తర్వాత చక్కటి భోజనం పెట్టే సంప్రదాయం నెలకొల్పారన్నారు. ఎం.ఎస్. నారాయణ మాట్లాడుతూ.. తాను రచయితగా తొలిసారి పద్మనాభంకే కథ చెప్పాను. తర్వాత ఆయనలా హాస్యనటుడిని కావడం ఆనందంగా ఉందన్నారు.

అనంతరం డి. సురేష్‌బాబు రూ.50వేలు, భరణి, రూ.25వేలు, మిగిలిన నటులందరూ కలిసి 3లక్షల రూపాయల నగదును పద్మనాభంకు బహుమతిగా అందజేశారు. ఇవిగాకుండా.. డా.దాసరి నారాయణరావు తాను ప్రతినెలా మూడువేలు, నటుడు అనంత్ నెలకు రెండువేలు పద్మనాభంకు పంపించనున్నట్లు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి