తెలుగు సినిమాకు సెప్టెంబరు 15న ఎనభైవ పుట్టినరోజు

బుధవారం, 14 సెప్టెంబరు 2011 (22:27 IST)
FILE
హరికథలు, బుర్రకథలు, తప్పెట్లు, జానపదాలు, తోలుబొమ్మలు, వీధినాటకాలు, నాటికలు, నాటకాలు.. ఇలా ఒక్కో దశ నుంచి ప్రజలకు వినోదాన్ని పండించే ప్రక్రియ పలు రూపాంతరాలు చెందుతూ తెల్లటిగోడపై ప్రొజెక్టర్‌ అనే మిషన్‌తో కదిలే బొమ్మలుగా అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత గోడ బదులు తెల్లటి వస్త్రాలు వేదికగా చేసుకుంది. క్రమేణా వెండితెరగా రూపాంతరం చెందింది. మాటలు లేని కదిలే బొమ్మలు కాస్తా మాటలు పలికే బొమ్మలుగా మారేసరికి 1931 సెప్టెంబర్‌ 15 వచ్చింది.

భక్తబ్రహ్మాద అనే చిత్రంతో తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా రిలీజ్‌ అయింది అదేరోజు. కానీ తమిళంలో ఇంకాస్త ముందుగా రిలీజ్‌ అయినా... తెలుగులో మాత్రం ఇది కరెక్ట్‌ కాదనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా తెలుగు చలనచిత్రరంగం మాత్రం సెప్టెంబర్‌ 15న చలనచిత్స్రోతవం జరపుకోవడం సాంప్రదాయమైంది. నేటికి కదిలేబొమ్మలకు మాటలొచ్చి 80 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భాన్ని తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 'తెలుగు చలన ఉత్సవం'గా పండుగ చేసుకుంటుంది. ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు ఛాంబర్‌లో సినీరంగానికి చెందిన అలనాటి, నేటి నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరై కళామతళ్లిని ఆరాధించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి గతంలోకి వెళితే...

1929లో 'షో బోట్‌' అనే టాకీ మూవీని అమెరికాలో యూనివర్సల్‌ స్టూడియోస్‌ వారు నిర్మించారు. అమెరికాలో ఉన్న అర్దేశీ ఇరానీని ఈ సంఘటన ఎంతగానో ఆకట్టుకుంది. భారతదేశంలో కూడా ఇలా ఓ సినిమా తీయాలన్న తలంపు వచ్చింది. వెంటనే ఆ సినిమా తీసిన కంపెనీవారిని సంప్రదించి, సినిమా నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేశారు. కెమరా, సౌండ్‌ రికార్డింగ్‌ పరికరాలేగాక, అక్కడ పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులను కూడా తన జట్టులో చేర్చుకున్నాడు. భారతీయ తొలి టాకీ సినిమాకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందీ-ఉర్దూ భాషల్లో 'అలం అరా' అనే సినిమాను రూపొందించారు. తెరపై మాట్లాడే బొమ్మలు చూసి జనం ఆశ్చర్యపోయారు. తండోప తండాలుగా ప్రదర్శనశాలకు వచ్చేవారు.

అర్దేశీ ఇరానీ చేసిన ఈ ప్రయోగం సక్సెస్‌ అవటమేగాక, ఆర్థికంగానూ మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. వెంటనే ప్రాంతీయ భాషా చిత్రాల వైపు ఆయన దృష్టి సారించారు. తెలుగు, తమిళ భాషల్లో తొలి టాకీ సినిమాలు తీయాలని అనుకున్నారు. అందుకు తగిన టెక్నీషియన్ల కోసం వెదుకులాట మొదలైంది. ఆ ప్రయత్నంలో ఆయనకు హెచ్‌.ఎం.రెడ్డి తగిలారు. దక్షిణాది నుంచి సినిమా అనే రంగంలోకి వచ్చిన తొలి వ్యక్తిగా హెచ్‌.ఎం.రెడ్డిని చెప్పుకోవచ్చు. మూకీ సినిమా యుగంలో ఆయన ముంబయ్‌లో అడుగుపెట్టారు. 1927 సంవత్సరంలో...రిఫ్లెక్టర్‌ బాయ్‌గా మూకీ సినిమాలకు పనిచేశారు. సినిమా అనే మాద్యమంపై మంచి అవగాహన ఏర్పడింది.

టెక్నికల్‌గానూ హెచ్‌.ఎం.రెడ్డి కొంత పరిజ్ఞానాన్ని పొందారు. ఇదంతా ఇరానీ ఇండియాకు రాకముందు. ఆయన ముంబాయ్‌లో అడుగు పెట్టి ఈ రంగంలో ఉన్న యువకులను అంతా పోగుచేసి పలు భాషల్లో టాకీ సినిమాలు తీయాలని బయలుదేరారు. సినిమా పట్ల ఉండే అవగాహన, కథ, నటీనటులు మొదలైన విషయాలు హెచ్‌.ఎం.రెడ్డికి ఉన్నాయని అర్దేషీ ఇరానీ గ్రహించాడు.

సురభివారే ప్రధాన పాత్రదారులు
అంతా నిర్ణయమైపోయింది. మంచి కథ చూడాలి, నటులు కావాలి, టెక్నీషియన్లు కావాలి... ఎక్కడి కెళతాం... నటులు కావాలంటే నాటకాల కంపెనీలోనే వెతకాలి. ఎక్కడో ఎందుకు నాటి రోజుల్లో సురభీ నాటక సమాజం చాలా ఫేమస్‌. వారు వేసే భక్త ప్రహ్లాద నాటకం కూడా చాలా పాపులర్‌. హెచ్‌.ఎం.రెడ్డి కూడా వారినే సంప్రదించారు. పైగా ప్రముఖ స్టేజ్‌ యాక్టర్‌ సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు ఈయనకు క్లోజ్‌ ఫ్రెండ్‌. ఆయన్ని సంప్రదించటం, సురభీ నాటక సమాజంలోని ఇతర నటులు వి.వి.సుబ్బారావు, కమలాభాయి, మాస్టర్‌ క్రిష్ణారావు తదితరులతో తీయాలని డిసైడ్‌ అవటం వెంటనే జరిగిపోయింది.

ఓ కామిక్‌ రోల్‌ కోసం సురభీ నాటక సమాజంతో సంబంధంలేని వ్యక్తిని ఎంపికచేశారు. అతనే ఎల్‌.వి.ప్రసాద్‌. ఆ తర్వాత ఇరానీతో చాలాకాలంపాటు ఎల్‌.వి.ప్రసాద్‌ పనిచేశారు. చందల కేసవదాసు గేయ రచన చేశారు. ఇరానీ సినిమాటోగ్రఫీ అందించారు. సురభి నాటక సమాజం వారు వేసే 'భక్త ప్రహ్లాద' నాటకానికి హెచ్‌.ఎం.రెడ్డి తెరరూపమిచ్చారు. ఒరిజినల్‌ డ్రామా వెర్షన్‌కు పలు మార్పులు కూడా చేశారు. సినిమా అంతా బొంబాయ్‌లోనే షూటింగ్‌ జరుపుకుంది. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో, తొలి తెలుగు టాకీ మూవీ 'భక్త ప్రహ్లాద' 1931లో రిలీజైంది. అలాగే తమిళంలో 'కాళిదాసు' నిర్మించారు.

ఈనాడు ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి తెరపై కదలాడిన బొమ్మలో పలు శబ్డాలు వచ్చేవి. నటీనటులు చెప్పిన డైలాగ్స్‌ స్పష్టంగా వినబడేవి కాదు. కెమరా ముందు, పెద్ద పెద్ద లైటింగ్స్‌ ముఖంపై పడుతుంటే...నటించడమనే ప్రక్రియ అప్పటివరకూ స్టేజీ ఆర్టిస్ట్‌కు తెలియని విషయం. మైక్రోఫోన్‌లో గట్టిగా మాట్లాడటం కూడా పిక్చర్‌ క్వాలిటీని దెబ్బతీసేది. ఇవన్నీ అనుభవలేమి వల్ల జరిగినవే. తర్వాత ఏ స్థాయిలో డైలాగ్‌ చెప్పాలన్న విషయం కూడా అప్పటివారికి తెలియదు. ఎందుకంటే స్టేజీపైన ఏ డైలాగ్‌ అయినా గట్టిగా చెప్పిన అలవాటే ఉండేది. తొలినాళ్లలో ఇవన్నీ దర్శకనిర్మాతలకు ఎదురైన ఇబ్బందులు. తీసినవారు సరే...చూసిన వారి అనుభవమేంటి అంటారా...

రేట్ల తేడాలు...
'టెక్నికల్‌గా చాలా లోపాలుండొచ్చు. కాని వారు చేసిన ప్రయత్నం గొప్పది. చారిత్రాత్మకమైంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆశ్చర్యపర్చింది' అని 92 ఏళ్ల వెటరన్‌ జర్నలిస్ట్‌ మద్దాలి సత్యనారాయణ శర్మ అంటున్నారు. 12 ఏళ్ల వయసులో ఆయనికు సినిమా అనేది పరిచయమైంది. వచ్చిన సినిమాను రెండుసార్లు చూస్తేగానీ మనసు కుదటపడేది కాదు. తొలి టాకీ సినిమా 'భక్త ప్రహ్లాద' గురించి ఈయన ఇలా అంటున్నారు...

'నాకు బాగా గుర్తు. గుడివాడలోని మారుతి థియేటర్‌లో వేశారు. టికెట్స్‌లో మూడు కేటగిరీలు ఉండేవి. నాలుగు అణాలకు (పావలా) కుర్చీ టికెట్‌. రెండు అణాలకు బెంచ్‌, ఒక అణాకు నేల టికెట్‌. రోజుకు రెండు ఆటలు. ఒకటి సాయంత్రం 6 గంటలకు, తర్వాత 9 గంటలకు. శనివారం, ఆదివారం మ్యాట్నీ షోలు ఉండేవి. టికెట్స్‌ కోసం క్యూ అనే పద్ధతే తెలియదు. ఎవరిష్టం ఉన్నట్టు వారు ప్రయత్నించేవారు. కేవలం సింగిల్‌ ప్రొజెక్టర్‌ మాత్రమే ఉండేది. ప్రతీ 15 నిమిషాల కోసం రీల్‌ డబ్బా మార్చాల్సిందే. 'భక్త ప్రహ్లాద' మొదటిసారిగా చూసిన తర్వాత, నాటకానికి, సినిమాకు పెద్దగా తేడా అనిపించలేదు. కదులుతున్న బొమ్మ, మాటలు ఇవన్నీ జనాన్ని విపరీతంగా ఆకర్షించేవి. ఆశ్చర్యపర్చేవి' అని తెలిపారు.

ఎడిసన్‌ ప్రయోగం
ప్రపంచంలో తొలి టాకీ సినిమా విషయానికొస్తే... 1927లో అక్టోబర్‌ 6న 'ద జాజ్‌ సింగర్‌' తొలి టాకీ మూవీ రిలీజ్‌ అయింది. బ్రిటిష్‌ ఫోటొగ్రాఫర్‌ ఫ్రీజ్‌ గ్రీన్‌ తీశాడు. ఇతను స్వయంగా క్రోనోఫోటొగ్రాఫిక్‌ అనే కెమారా తయారు చేశాడు. ఈ పరికరంతోనే తొలి టాకీ చిత్రీకరించాడు. అసలు మోషన్‌ పిక్చర్‌కు అంకురార్పరణ జరిగిందంటే, ఆ క్రెడిట్‌ ప్రముఖ శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌కు దక్కుతుంది. 1913లో ఆయన కినెటోస్కోప్‌ అనే కెమెరాను తయారు చేశాడు. ఈయన తయారుచేసిన కెమెరా మోషన్‌ ఫోటోగ్రఫీలో విప్లవం తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన అనేక మార్పులు ప్రపంచ సినిమాను, ఇటు తెలుగు సినీ రంగాన్ని ప్రభావితం చేశాయి. నూతన సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి వచ్చింది.

1980 వరకూ ఉన్న కాలాన్ని తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు, నటీనటులు తెరపైకి వచ్చారు. హిందీ, తమిళ పరిశ్రమలోనూ వీరి ప్రయాణం సాగింది. 1990 నుంచీ కొద్ది కొద్దిగా తెలుగు సినిమా పరిశ్రమలో మార్పు వచ్చింది. పరభాషా నటులేగాక, టెక్నీషియన్లు, హీరోయిన్లు, దర్శకులు రావటం మొదలైంది. లోకల్‌ టాలెంట్‌ దొరకటం లేదనే కారణంతో పరభాషా నిపుణులను తీసుకురావటం ఎక్కువైంది. 'ఆ రోజుల్లో కథ చాలా ప్రధానమైన విషయం. అందుకు తగ్గట్టు ఇక్కడి నటులను తీసుకునేవారు. కానీ నేడు కంటెంట్‌ కన్నా కామర్స్‌ ప్రధానంగా నడుస్తోంది' అని ప్రముఖ నిర్మాత అభిప్రాయపడ్డారు.

టాకీ సినిమా వచ్చి సెప్టెంబర్‌ 15 నాటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. తొలి 60 ఏళ్లలో 3,549 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 20 ఏళ్లలో దాదాపు 2,400 సినిమాలు విడులయ్యాయి. సినిమాల సంఖ్య ఎంత పెరిగిందో, సక్సెస్‌ రేషియో కూడా అదే విధంగా పడిపోయింది. దీన్నుంచి బయటపడటానికి నేడున్న దర్శకనిర్మాతలు నూతన దారులు వెదకాల్సిందే.

వెబ్దునియా పై చదవండి