తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్ రాజబాబు.
ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు.
1960లో మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ టైమ్‌లో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్‌మాన్‌ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు.
ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు.
అడపాదడపా చిన్నచిన్న వేషాలు వేసినా జగపతి వారి అంతస్తులు చిత్రం ఆయన నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన తిరిగి చూడలేదు. బిజీ అయిపోయారు. ఒక దశలో రోజుకు రెండు, మూడు షిప్ట్‌లు పనిచేసిన సందర్భాలు కూడా వున్నాయి. హాస్యనటుడిగానే కాక కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అందర్నీ నవ్వించి ఆనందపర్చిన రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పరచి ప్రతీ పుట్టినరోజున ఒక ప్రముఖుడ్ని సన్మానించి మూడురోజులపాటు నాటకప్రదర్శనలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే తన నటజీవితానికి ప్రేరణ అయిన అప్పటి హాస్యనటుడు బాలకృష్ణ(అంజి)ని సన్మానించారు.